నవ్వుతూ బ్రతకాలిరా.. (మే 5 మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవం ) నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు జంద్యాల గారు.ఇదివరకు మనవాళ్ళు నవ్వు నాలుగు విధాలా చేటు అన్నారు. కాని ఇప్పుడు నవ్వు నలభై విధాలా గ్రేటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నవ్వడం మూలాన జీవితంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలనుంచి దూరంగా ఉండొచ్చు.ఇప్పుడు మన దేశంలోకూడా నవ్వుల దినోత్సవాన్ని ఘనంగానే జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా నవ్వుల పండుగను ఆస్వాదిస్తున్నారు. నవ్వు గురించి బోలెడు విశ్లేషణలు ఉన్నాయి. ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా చిరునవ్వు విలువ చెబుతూ ఉంటారు. నవ్వులు ఎన్నో రకాలు. నవ్వుకూ చిరునవ్వుకూ చాలా తేడా ఉంది. నవ్వీ నవ్వనట్లుగా, పెదాల మధ్య స్వచ్ఛమైన పువ్వుల్లా విచ్చుకునేదే చిరునవ్వు. అమెరికాలోని బాల్ మెమోరియల్ హాస్పిటల్ అనే సంస్థ 18 రకాల నవ్వులను గుర్తించింది. నవ్వులు ఎన్ని ఉన్నా, చిరునవ్వు ప్రత్యేకతే వేరు. మనకు అత్యంత ఆత్మీయులు ఎదురైనప్పుడు మాటకన్నా ముందుగా మనసులోంచి ఉబికివచ్చే భావనే చిరునవ్వు. కొద్దిపాటి పరిచయాలను కూడా దృఢపరిచి, స్నేహ...